నవంబర్ 24: వచ్చే నెల ఒకటి నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహణ: సీఎం రేవంత్ రెడ్డి
4న పెద్దపల్లి సభలోగ్రూప్4కు ఎంపికైనోళ్లకు జాయినింగ్ ఆర్డర్స్
లక్ష మంది తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
విజయోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
హైదరాబాద్ : రాష్ట్రంలో 9 రోజులపాటు ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. 4న పెద్దపల్లి సభ వేదికగా గ్రూప్ -4 తో పాటు వివిధ జాబులకు ఎంపికైన 9 వేల మందికి నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సెక్రటేరియెట్ లో ప్రజాపాలనవిజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ పాల్గొన్నారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతోపాటు భవిష్యత్తు ప్రణాళికను ప్రజలకు వివరించాలని రేవంత్ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలన్ని వారంలో జరిగేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. శాఖలవారీగా రోజుకో మంత్రి తొలి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికను మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని సూచించారు.
రాష్ట్రమంతటా పండుగ వాతావరణం
సెక్రటేరియట్ పరిసరాలు, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.తెలంగాణ సంస్కృతి, కళారూపాలు ఉట్టి పడేలా డ్రోన్ షో నిర్వహించాలని సూచించారు. రాష్ట్రమంతటా అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని పేర్కొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహ పనుల పరిశీలన
రివ్యూ తర్వాత సెక్రటేరియెట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను సీఎం పరిశీలించారు.వచ్చే నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. ఆ రోజు సాయంత్రం జరిగే ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులు, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహ్వానించాలని అధికారులకు సీఎం సూచించారు. నియోజకవర్గానికో వెయ్యి మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించి, లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.