మరుగునపడ్డ మహామేధావి !

మరుగునపడ్డ మహామేధావి !

ఎం. వి. వి. కె. రంగాచారి భారతదేశంలోని తొలి ఆధునిక భావోద్యమకారుల్లో ఒకరు. 1889లో ముదునూరుపాడు అనే గ్రామంలో పుట్టిన ఆయన బాల్యంలోనే కుటుంబంలోని ఛాందస మతతత్వాన్ని చూసారు. సముద్ర యానం చేసే వారి బంధువుల్ని తోటివారే వెలేయడం చూసి చలించిపోయారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లా చేసినాయన 1910లో హైకోర్టులో న్యాయ వాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఎన్నో సామాజిక వివక్షల్ని, అసాంఘిక కట్టు బాట్లనూ కళ్ళారా చూసి స్వతంత్ర చింతనాశీలిగా మారి మూఢాచారాల్ని నిరసించారు. వందేళ్ళ క్రితం 1920 లోనే లండన్‌లోని రేషనలిస్ట్ ప్రెస్ అసోసియేషన్‌లో సభ్యుడవ్వడమే కాకుండా ఆ అంతర్జాతీయ హేతువాద సంఘానికి మద్రాసు ప్రెసిడెన్సీలో గౌరవ కార్యదర్శిగా కూడా నియమితు లయ్యారు. ఇంకా సంస్కరణవాద ఛాయలే తెలుగు నేలని పూర్తిగా తాకని ఆనాటి వాతావరణంలో ఏకంగా ప్రపంచంలోనే విశిష్టమైన భావోద్యమ సంఘంలో భాగస్వామైన తొలి తెలుగు వ్యక్తుల్లో రంగాచారి ఒకరు.
……
అంతేకాదు, బొంబాయి కేంద్రంగా ఏర్పడిన భారతీయ హేతువాద సంఘం (రేషనలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా)లో రంగా చార్య క్రియాశీల వ్యక్తి. ఆ సంస్థ నడిపే “రీజన్ రివోల్ట్” పత్రికలో ఎన్నో విలువైన రచనలు చేశారు. ఇండియన్ ఫిలాసఫికల్ కాంగ్రెస్‌లో సభ్యనిగా ఉండటమే కాదు, అలహాబాద్‌లో జరిగిన 14వభారతీయ తాత్విక మహాసభలో “నైతికత – సాంఘిక తత్వం’ అనే విభాగానికి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అమెరికాకి చెందినప్రముఖ హేతువాది మాక్స్ ఐసెన్‌బర్గ్, ఇంగ్లాండ్‌కి చెందిన విఖ్యాత భావోద్యమ నాయకుడైన చార్లెస్ బ్రాడ్లా కుమార్తె చార్లెస్ బ్రాడ్లా బోనర్ వంటి మహామహులు కూడా రంగాచారి సాహిత్య కృషిని ప్రశంసించారంటే ఆనాడు ఒంటిచేత్తో అక్షరాల్ని ఆసరాగా చేసుకుని ఆయన చేసిన భావోద్యమాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రభావం కలిగించాయో అర్ధం అవుతుంది.
……
వివిధ రకాల తాత్విక, మత, వైజ్ఞానిక భావ ధారల్ని విశ్లేషిస్తూ Groundwork In Dialectics (How Thought and Things Ever Derive) అనే రెండొందల పుటల రచన చేసిన రంగాచారి ఆధునిక ఆలోచనాధారని పరిచయం చేస్తూ, ‘ముకుందమాల’ అనే గ్రంథం రాసారు.ప్రపంచ మతాల సమ్మేళనం (world congress of faiths) అంతర్జాతీయ మహాసభలు పారిస్, శ్రీలంక, తదితర దేశాల్లో జరిగినప్పుడు పరిశోధనాత్మక వ్యాసాల్ని సమర్పించారు. రాజారామ్మోహన్ రాయ్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా జరిగినకార్యక్రమంలో రాజారామ్మోహన్ రాయ్ ని ‘నాస్తికుడు’ గా విశ్లేషించడమే కాకుండా, చార్లెస్బ్రాడ్లా,ఇంగర్‌ సోల్ వంటి భావోద్యమకారులతో పోలుస్తూ అత్యద్భుతంగా ప్రసంగించారని ఆ సంద ర్భంగా ప్రచురించిన సావనీర్‌లో ఉంది.రవీంద్రనాథ్ ఠాగూర్, ఎమ్మెన్ రాయ్ వంటి మహామహులతో సమానంగా ఒక తెలుగు వాడు ప్రసంగించడం, రచనలు చేయడం అసాధారణ విషయం.
……
ఐతే, దురదృష్టవశాత్తు ఇంతటి మహావ్యక్తి గురించి మనకి లభిస్తున్న సమాచారం చాలా తక్కువే. ఆయన సమకాలీకులు కానీ తదనంతరం కానీ రంగాచారి కోసం ఎక్కడా నమోదు చేయలేదు. హేతువాద, మానవవాద చరిత్రలో సైతం ఫలానా రంగాచారి అనే వ్యక్తి భావోద్యమ రచనలు చేస్తుండే వారనే వరకే ఉంది. మహాతాత్వికుడు నీషే మొదలుకుని బెర్ట్రాండ్ రస్సెల్ వరకూ ఆయన అత్యంత శక్తివంతమైన రీతిలో గొప్ప ఇంగ్లీషు భాషలో చేసిన రచనలు కొన్ని అంతర్జాలంలో లభిస్తున్నాయి. రంగాచారి కాకినాడ ఎందుకు వచ్చారో తెలీదు. తెలుగులో ఏవైనా రాసా రేమో వివరం లేదు. ఆంగ్లంలో మాత్రం విస్తారమైన రచనా వ్యాసంగం కావించినట్లు తెలుస్తోంది. ఐతే, 1960 ఫిబ్రవరి నాటి ‘ఇండియన్ లిబరిటేరియన్’ పత్రికలో రంగాచారి కుమారుడు సత్యం 28 – 12 – 1959 న ఆయన మరణించినట్లు తెలియ జేస్తూ రంగాచారి గారి కోసం రాసిన సంక్షిప్త పరిచయం మాత్రమే ఆయన గురించిన ఏకైక ఆధారం.
……
దానిప్రకారం సాంప్రదాయిక వైష్ణవడిగా పుట్టిన రంగాచారికి చిన్న వయసులోనే వివాహం జరిగిందనీ, ఆయనకి దేశదేశాల ఆలోచనా పరులు, భావోద్యమాలతో సంబంధాలు ఉన్నాయనీ, ఆయన చివరి రోజుల్లో పక్షవాతంతో బాధపడుతున్నప్పుడు కూడా సాహిత్య పఠనం, రచనా వ్యాసంగం
విడనాడలేదనీ తెలుస్తుంది. చనిపోవడానికి వారం రోజుల ముందు కూడా (బెంగు ళూరులో ?) “World State” (విశ్వజనీన రాజ్యం) అనే రచనను ప్రచురణకి సిద్ధం చేసారనంటే ప్రజాపక్ష మేధావిగా, విస్తృత రచయితగా ఆయన నిబద్ధతకి అదో తిరుగులేని చిహ్నం. జీవితాంతం తండ్రిగా, గురువుగా, మార్గదర్శిగా రంగాచారి మసిలిన తీరును, ఆయనతోగల ఆప్యాయతను ఆ చిన్న నివాళి వ్యాసంలో కుమారుడుగా సత్యం వ్యక్తీకరించిన విధానం వారిద్దరి అనుబంధానికి చిహ్నం. ఐతే,తర్వాత కాలంలో ఆ పిల్లలు, వారి వివరాలు ఏమీ తెలియడం లేదు. కనీసం రంగాచారి పూర్తి రచనల జాబితా కూడా దొరకడం లేదు.
……
“The basic spiritual truth in Indian philos ophy is Man.”అన్న రంగాచారి, “Humanity is the meeting ground of all religion, philos ophy, politics , science and the art of life…” అంటారు ఓ చోట. మతాలయినా, రాజకీయ తత్వాలయినా, శాస్త్రీయ మార్గా లయినా మమేకం కావల్సింది మానవతతోనే అని ఆయన భావన. యావత్ తెలుగు నేల మీద తొలితరం భావోద్యమ ప్రచారకుల్లో ఒకరిగా ఎం. వి. వి. కే. రంగా చారి గారి గురించిన మరింత సమాచారం వెలికి తీయాల్సి ఉంది. ఎందుకంటే, ఆయన పట్టభద్రుడు మాత్రమే కాదు. ఉన్నత విద్యావంతుడిగా, భావోద్యమ నేతగా మత సామరస్యకునిగా, మానవోద్యమ కార్యకర్తగా, ప్రత్యామ్నాయ సాహితీవేత్తగా వెలిగిన వ్యక్తి.వేదవేదాంగ ఇతిహాసాలు, ఉపనిషత్తులు పురాణములు మొదలుకొని భక్తి ఉద్యమాలు, వివిధ వైజ్ఞానిక మార్గాల్ని లోతుగా అధ్యయనం చేసిన మేధావి. తెలుగునాట సగటు మనిషి కోసం కలం పట్టిన చింతనాపరుడు. పేరు కోసమో గుర్తింపు కోసమో కాకుండా తాను నమ్మిన దాన్ని నిజాయితీగా బహిరంగంగా అక్షరాల్లో స్పష్టంగా ప్రకటించిన ధైర్యశాలి. మరి, అలాంటి వ్యక్తి యొక్క చరిత్ర మరుగున పడటం అంటే అది మొత్తం భావోద్యమాల్లో
కొనసాగుతున్న సంక్షోభానికి ప్రతీక.
……
మానవాళి ఆలోచనా సరళిని వికసింపజేసిన మహనీయుల చరిత్ర సమాజం పురోగతికి తోడ్పడుతుంది. వారి కృషిని విస్మరించిన వ్యవస్థ ప్రమాదకరమైన ధోరణులకు వంత పాడుతుంది. ఏ కాలంలోనైనా సరే, సంకుచి తత్వాన్నికాదని విశాలదృక్పథంతోముందుకు సాగిన వారినే చరిత్ర గుర్తిస్తుంది.అందుకనే, మతతత్వ రాజకీయ ధోరణులు కొత్త రూపాలలో పేట్రేగిపోతున్న ప్రస్తుత కాలంలో తెలుగు నాట కులమతాలకు అతీతంగా భావోద్యమాల్ని తన అక్షరాలతో, ఆచరణతో బలోపేతం చేసిన ఎమ్. వి. వి. కే. రంగాచారి వంటి వారి మహత్తర కృషిని స్మరించుకోవడం సమాజంలో మానవత్వం ఇంకా పూర్తిగా మసకబార లేదనడానికి కనీస సంకేతం. అలా, ఆయన చూపిన మార్గంలో ఆలోచనో ద్యమాల్ని నిర్మించుకోగలగడమే రంగాచారి గారి కృషికి మనం ఇవ్వదగ్గ నిజమైన మానవీయ నివాళి.
……
(డిసెంబరు 28 రంగాచారి 65 వ వర్ధంతి.) – 😭😭😭🙏🙏🙏

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *