డిసెంబర్ 3:తెలంగాణ రాష్ట్ర సాధనలో అమర వీరుల త్యాగాలు మరువలేనివని, తెలంగాణ మలిదశ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి లాంటి ఎంతో మంది త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీ, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు.
శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన తెలంగాణ యూత్ డే సదస్సు లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు పాల్గొన్నారు.శ్రీకాంతాచారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి శ్రీకాంతాచారి బలిదానం కారణమైందని, తెలంగాణ కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం గొప్పదని అన్నారు. తెలంగాణ బిడ్డల పోరాటాన్ని చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసి కూడా సోనియమ్మ రాష్ట్రాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. అమరుల త్యాగాలతో గద్దెనెక్కిన కేసీఆర్… శ్రీకాంతాచారితో పాటు ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల కుటుంబాలకు, ఉదమ్యకారులకు న్యాయం చేయలేదని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల అకాంక్షలు నెరవేర్చలేదని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని వెల్లడించారు. పదేళ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని, తెలంగాణ మూల స్వభావమైన స్చేచ్ఛపై దాడి జరిగిందని తెలిపారు. ప్రజా గాయకుడు గద్దర్, ప్రొఫెసర్ కోదండరాం లాంటి వారిని అవమానించారని అన్నారు. మిగులు రాష్ట్రాన్ని అప్పులతో అధోగతి పాలు చేశారని, బాధ్యతారహిత పాలన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరులు, ఉద్యమకారుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా సీయం రేవంత్ రెడ్డి సారధ్యంలోని తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఉద్యమకారుల కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందన్నారు. ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే.. తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాది కాలంలోనే 50 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని చెప్పారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను ఏడాది పాలనలో చేసి చూపించామని తెలిపారు. ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు అని అడిగే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో తెలంగాణ జన సమితి యూత్ ప్రెసిడెంట్ సలీం పాషా, విద్యార్థి జనసమితి వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్, జనరల్ సెక్రటరీ ప్రశాంత్, సెక్రటరీ రవి నాయక్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.