డిసెంబర్ 5 హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్ యాప్ సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా గురువారం ప్రారంభించనున్నారు. శుక్రవారం నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అన్న తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల పంపిణీ పూర్తయ్యే వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలని అధికారులు నిర్ణయించారు. గ్రామీణులను దృష్టిలో పెట్టుకుని యాప్లో తెలుగు వెర్షన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం.