డిసెంబర్ 2: చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. అయితే చలిగాలులు అనేక రకాల వ్యాధులను కూడా మోసుకొస్తున్నాయి. ఈ సీజన్‌లో ప్రజల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలిగాలులు శరీరంలోకి వెళ్లడంతో వైరస్‌లు మరింత వృద్ధి చెందే ప్రమాదం ఉందని అంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చలితీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు కూడా పేర్కొంటున్నారు.”సమస్యలు“
ఫ్లూ, సైనసైటిస్, ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్‌ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(సీవోపీడీ), ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డ కట్టి గాయాలు కావటం, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.”లక్షణాలు”
దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి.”జాగ్రత్తలు“
చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించాలి. దీంతో వైరస్ సోకదు. వేరేవారికి సోకకుండా ఉంటుంది. ఎవరైనా వాతావరణాన్ని అంచనా వేసుకుని బయటకు రావాలి. మరీ చలితీవ్రత అధికంగా ఉంటే బయటకు రాకుండా ఉంటే మంచిది. ము ఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇన్‌హేలర్లను వాడుతుండాలి.”ఎవరికి ఇబ్బంది“
చలి తీవ్రత నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు వేడివేడిగా సరైన ఆహారం తీసుకోవాలి. పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి. చలిగాలులు ఉన్నప్పుడు చిన్నారులను బయట తిప్పకూడదు. ఎక్కువరోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి రక్తం రావటం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చలిగాలుల్లో ఆరు బయట పనిచేసే కార్మికులు, వీధుల్లో గడిపే నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలి.కారణాలు.
ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల వైరస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో శరీరంలో వైరస్ కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఈ వాతావరణంలో ఒకరి నుంచి మరొకరికి వేగంగా ఫ్లూ వ్యాప్తి చెందుతుంది.వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవాలి..
చలికాలంలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. దీంతో పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఉసిరి, నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మరింత మంచిది. విపరీతమైన చలికి జాగ్రత్తలు తీసుకోకపోతే, అవయవాల్లో గాయాలై మరణాలు సంభవించవచ్చు.
- డాక్టర్ ఎం.రాజీవ్, పల్మనాలజిస్ట్, టీజీఎంఎస్ సభ్యుడు