నవంబర్ 26:భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ దృష్ట్యా ఈ ఏడాది మన రాజ్యాంగ అమృతోత్సవ సంవత్సరం. ఆ అద్భుత మౌలిక శాసన రూపకల్పనలో పాల్గొన్న 15 మంది మహిళామూర్తుల గురించి ఈ అమృతోత్సవ సంవత్సరంలో ప్రత్యేకంగా గుర్తుచేసుకోవడమనేది మన నైతిక కర్త్యవం.
ఈ అసాధారణ మహిళలు తమ వ్యక్తిగత జీవితాల్లో ఎదురైన ఎన్నో ప్రతికూలతలు అధిగమించి ప్రజా జీవితంలో జీవించినవారు. రాజ్యాంగ పరిషత్తులో వారు చర్చకు పెట్టిన విషయాలు దూరదృష్టితో కూడినట్టివి. వివిధ అంశాలపై వారి వాదనా పటిమ అసమానమైనది. మన సమున్నత రాజ్యాంగ స్రష్టలుగా చరిత్రలో నిలిచిపోయిన ఆ మహిళామణులు: అన్నే మాస్కారిని, దాక్షాయణి వేలాయుధన్, దుర్గాబాయి దేశ్‌ముఖ్, విజయలక్ష్మి పండిట్, సరోజినీ నాయుడు, కమల చౌదరీ, రాజకుమారి అమృత్‌కౌర్, అమ్ము స్వామినాథన్, లీల రాయ్, రేణుక రే, బేగం ఐజాజ్ రసూల్, హంసా జీవరాజ్ మెహతా, మాలతి చౌదరీ, పూర్ణిమా బెనెర్జీ, సుచేతా కృపాలానీ. ఈ మహిళలు విభిన్న పామాజిక నేపథ్యాల నుంచి, వివిధ వృత్తులు, లేదా వ్యాపకాల నుంచి జాతీయోద్యమంలోకి వచ్చినవారు. వారిలో కొందరు బారిష్టర్లు, సంఘసంస్కర్తలు. వీరిలో ప్రతి ఒక్కరికీ సొంత సైద్ద్ధాంతిక దృక్పథాలు ఉన్నాయి. అయినప్పటికీ రాజ్యాంగ సభ చర్చల్లో వారు చూపించిన శ్రద్ధాశక్తులు ప్రశస్తమైనవి. రాజకీయ, ఆర్థిక, సామాజికవిషయాలతో పాటు, మహిళా సమానత్వం, బాలికావిద్య, అణగారిన వర్గాల అభ్యున్నతి మొదలైనవాటిపై ఆ మహిళా రాజ్యాంగ నిర్మాతలు మౌలిక ప్రతిపాదనలు చేశారు.
ఉమెన్స్ ఇండియా అసోసియేషన్‌ను స్థాపించిన అమ్ము స్వామినాథన్ రాజ్యాంగం ఇచ్చిన సమానత్వాన్ని ఆమోదించగా, హంసా మెహతా సమానత్వాన్ని ఆమోదిస్తూనే, మహిళలకు రాజకీయ, అర్థిక, సాంఘిక రంగాలలో సమాన అవకాశాలు ఉండాలని డిమాండ్ చేసారు. హంసా మెహతా, రాజకుమారి అమృత్ కౌర్ మహిళా హక్కులు, విధులు అనే చార్టర్‌ను తయారుచేయటంతో పాటు యూనిఫామ్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి) అమోదించాలని కోరారు. ఇది జరిగినప్పుడే సమాజంలోని అన్ని వర్గాల మహిళలకు సమాన హక్కులు లభిస్తాయని స్పష్టం చేశారు. ఈ పదిహేనుమంది మహిళల్లో అతి పిన్న వయస్కురాలు, దళిత మహిళ అయిన దాక్షాయణి వేలాయుధన్ దళితుల హక్కుల గురించి మాట్లాడుతూ హరిజన్, క్రిస్టియన్, ముస్లిం లేదా సిక్కు… ఏ విధమయిన కుల,మతవాదమైనా జాతి అనే భావనకు విరుద్ధమని వక్కాణించారు. దళితులు బానిసలుగా ముఖ్యంగా ఆర్థిక బానిసలుగా ఉన్నంతకాలం, వారికి ప్రత్యేక రిజర్వేషన్ అన్నదానికి అర్థం ఉండదు. ‘ప్రత్యేక నియోజకవర్గాలు’ అన్న డిమాండ్ దళితుల పట్ల సరైన అవగాహన లేకపోవటంవల్ల, వాళ్ళని సమాజం హీనంగా చూస్తుండడం వల్ల వస్తుందని’ అంటూ రిజర్వేషన్లను ఆమె వ్యతిరేకించారు. ఆమె ఈ వాదనకు చాలామంది సభ్యులు హర్షం వ్యక్తం చేసారు. బేగం ఐజాజ్ రసూల్ అయితే రిజర్వేషన్ అన్నది ఆత్మఘాతుక ఆయుధం అని అన్నారు. రిజర్వేషన్ అన్నది దళితులకు దళితేతరులకు మధ్య అగాధం సృష్టిస్తుందని అన్నారు. చాలామంది మహిళా సభ్యులతో పాటు, డా. అంబేడ్కర్, మినూ మసాని, నెహ్రూ, ఇంకా చాలామంది కుల, జాతి, మత గుర్తింపులు కాకుండా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకున్నారు. అలాంటి ఒక గుర్తింపు మాత్రమే మతం కబంధ హస్తాల నుంచి దళితులని, మహిళలని రక్షిస్తుందని దాక్షాయణి అన్నారు (అయితే నేటికీ కూడా దళితుల హక్కులు కాలరాయబడుతున్నాయి.
స్వాతంత్య్ర శతాబ్దికి చేరువవుతున్న ప్రస్తుత కాలంలో కూడా దళితులు, మహిళలపై అత్యాచారాలు, నానా దాష్టీకాలు జరుగుతూనే ఉన్నాయి).
దేశ పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకు, ఆదేశిక సూత్రాలు సక్రమంగా అమలయ్యేలా బాధ్యత వహించేందుకు ఒక స్వతంత్ర అధికార యంత్రాంగం ఉండాలని బేగం ఇజాజ్ రసూల్ సూచించారు. పౌర స్వేచ్ఛ పరిపూర్ణంగా ఉండాలంటే, ప్రాథమిక హక్కులకు తక్కువ మినహాయింపులు ఉండాలని ఆమె కోరారు. బేగం ఇజాజ్ రసూల్ వాదనను అమ్ము స్వామినాథన్ బలపరుస్తూ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మన రాజ్యాంగ సౌధానికి రెండు బలమైన స్తంభాలు అని అభివర్ణించారు. దాక్షాయణి వేలాయుధన్ సమాజంలో బలవంతపు శ్రమని (forced labor) రద్దు చేయాలని డిమాండ్ చేసారు. దుర్గాబాయి దేశముఖ్ కానిస్టిట్యూషనల్ రెమెడీని పౌరులకి గల ఒక ముఖ్యమైన హక్కు అని అభివర్ణించారు. హిందీని రాష్ట్ర భాషగా అంగీకరిస్తూనే, ఆ భాషను హిందీయేతరులపై బలవంతంగా రుద్దకూడదని ఆమె
స్పష్టం చేశారు. మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం ఈ మహిళా సభ్యులు అందరూ బలంగా వాదించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
పూర్ణిమా బెనర్జీ, రేణుకా రే ఉన్నత విద్యార్హతలు పొందే విషయంలో మహిళలకు సమాన అవకాశాలు ఉండాలని, విద్యాసంస్థలలో మతపరమైన బోధనలు ఉండరాదని, అప్పటికే ఉన్న విద్యాసంస్థలలో మతపరమైన బోధనలను రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిషత్తు ముసాయిదాలోని ప్రివెంటివ్ డిటెన్షన్ నిబంధనపై పూర్ణిమా బెనర్జీ మాట్లాడుతూ డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్‌పై ఒక వ్యక్తిని ఖైదులో ఉంచడానికి సమయ పరిమితి ఉండాలని వాదించారు. అంతే కాదు ఖైదు చేయబడ్డ వ్యక్తి ఆ కుటుంబ సంపాదనపరుడైతే అతనికి మెయింటెనెన్స్ అలవెన్సు ఇవ్వాలని ప్రతిపాదించారు. రాజ్యాంగ పీఠికఫై చర్చ సమయంలో ‘సార్వభౌమ’ పదం అనేది ప్రజల సార్వభౌమత్వంగా ఉండాలని సూచించారు. రాజ్యసభ సభ్యుల అర్హతలకు సంబంధించిన చర్చలో సభ్యుల వయోపరిమితి 35సంవత్సరాలకు బదులు 30 సంవత్సరాలు ఉండాలని పూర్ణిమా బెనర్జీ అన్నారు.
పదిహేను మంది మహిళా సభ్యులూ వేర్వేరు చర్చల్లో రాజ్యాంగంలో కొన్ని మార్పులను సూచిస్తూ వివిధ అభ్యంతరాలు కూడా లేవనెత్తారు. పీఠికలో ‘సార్వభౌమ’ అనే పదం ‘ప్రజల సార్వభౌమత్వం’గా ఉండాలని పూర్ణిమా బెనర్జీ సూచించారు. అసంఖ్యాక ప్రజలను ప్రభావితం చేసే సినిమాలు ఉన్నత ప్రమాణాలతో ఉండేలా చట్టం చేయాలని సూచించడంతోపాటు బాల బాలికల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉండాలని దుర్గాబాయి దేశ్‌ముఖ్ కోరారు. రూపొందుతున్న రాజ్యాంగంలోని లోపాలను కూడా పలువురు మహిళా సభ్యులు ఎత్తి చూపారు. అమ్ము స్వామినాథన్, రేణుకా రేలు ఇంత సుదీర్ఘ రాజ్యాంగం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అమ్ము స్వామినాథన్ అయితే రాజ్యాంగం చిన్న పుస్తకం సైజులో ఉండాలని, సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమయ్యేలా ఉండాలని సూచించారు. మాలతి చౌదరి భారత రాజ్యాంగం, ఎక్కువగా ఇతరరాజ్యాంగాలపై ఆధారపడడం మంచిదికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతిమంగా ఈ మహిళా సభ్యులు అందరూ రాజ్యాంగ సభ ఆమోదించిన రాజ్యాంగం పట్ల సంతృప్తిని వ్యక్తపరిచారు. మన రాజ్యాంగం వివిధ దృక్పథాలను ప్రతిబింబిస్తుందని మెచ్చుకున్నారు. ‘Unity is meaningless without the accompaniment of women. Education is fruitless without educated women and agitation is incomplete without the strength of women.’ అని డాక్టర్ అంబేడ్కర్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ రాజ్యాంగ అమృతోత్సవం సందర్భంగా మన సంవిధాన మాతృమూర్తులకు నమో వాకాలు, ఘన నివాళులు అర్పిద్దాం.
పి.అరవిందకుమారి
(నవంబర్ 26: రాజ్యాంగ దినోత్సవం, భారత రాజ్యాంగ అమృతోత్సవం)