నవంబర్ 16:ఒక్కోసారి మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు. అసలు మద్యం తాగి వాహనం నడపడమే అతి పెద్ద తప్పు.
ఊదమంటారనే భయమే ఊపిరి తీసింది.. పోలీసులకు భయపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు.
హైదరాబాద్ నగరం శంషాబాద్ ఫ్లైఓవర్ పై అర్ధరాత్రి ఓ యువకుడు ఫుల్లుగా మద్యం సేవించి వాహనం నడుపుతూ వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ఆ మార్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండడం గమనించాడు. ఒకవేళ పోలీసులకు దొరికిపోతే ఫైన్, పోలీసు కేసు అంటూ ఎందుకీ తలనొప్పి అనుకున్నాడో ఏమో..! దారి మళ్లించి రాంగ్ రూట్లో వెళ్తూ ఓ కారును ఢీకొట్టాడు.
రాంగ్ రూట్లో బైక్‌పై వేగంగా వచ్చిన యువకుడు కారును బలంగా ఢీకొట్టాడు. స్పీడ్‌గా రావడం వల్ల ప్రమాదం పెద్దగానే జరిగింది. దీంతో అక్కడికక్కడే ఆ యువకుడు మృతి చెందాడు. సదరు వ్యక్తి తాగిన మైకంలో పోలీసులను చూసి భయాందోళనలకు గురై రాంగ్ రూట్లో వెళ్లి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడమే ఇంతటి అనర్థానికి దారి తీసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.