నవంబర్ 26: ఆదిలాబాద్ : పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల ఏర్పాట్ల కోసం అధికారులు ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.పంచాయతీల పాలన ఈ ఏడాది జనవరితో ముగియగా, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం జూలైతో ముగిసింది. సుమారు ఏడాదిగా పల్లెల్లో పాలన లేకపోవడంతో సమస్యలతో సతమవుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు ఇప్పటినుంచి తమ ప్రయత్నాలను క్షేత్రస్థాయిలో ముమ్మరం చేస్తున్నారు. రిజర్వేషన్లు మారే అవకాశం..?స్థానిక సంస్థలకు ఇప్పుడున్న రిజర్వేషన్లను యధావిధిగా అమలు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ప్రభుత్వం బీసీ కుల గణన సర్వే జరుపుతున్నందున జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పంచాయతీ వార్డులు మొదలుకొని ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ స్థానాల వరకు రిజర్వేషన్లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం రిజర్వేషన్లు అనుకూలించక పోటీకి దూరంగా ఉన్న బీసీ సామాజిక వర్గాలు కులగణన అనంతరం రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉండటంతో పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు. గతంలో కంటే ప్రస్తుతం పోటీ చేనున్న వారి సంఖ్య ఉమ్మడి జిల్లాలో బాగా పెరగనుందని స్థానిక వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో రిజర్వేషన్లు అనుకూలంగా వస్తాయి అని నమ్మకంతో ప్రజల్లో తమ ఉనికిని చాటుకునేందుకు ఆశావాహులు చాప కింద నీరులా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నారు. థామస్ అయితే మీ సారి స్థానిక సంస్థల్లో పోటీలో ఉంటున్నట్లు ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు.
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కసరత్తు..
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన అనంతరమే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా అధికారులు ఇప్పటికే కసరత్తుల ముమ్మరం చేశారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయడంతో రిజర్వేషన్లు పదేళ్ల వరకు కొనసాగేలా మార్పులు చేసింది. కానీ బీసీ కులగనణ జరుగుతుండడంతో తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ లోగా కూడా గణన సర్వే ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో వీటి ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులు మరో నాలుగు నెలల పాటు ఆగక తప్పదు అంటున్నారు.
విలీన గ్రామాల ఎన్నికల పై ఉత్కంఠ..
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పట్టణ పరిసర ప్రాంతాల్లోని చుట్టుపక్కల గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసింది. దీంతో మున్సిపాలిటీలో విలీన గ్రామాల పరిస్థితి పై సర్వత్రా జోరుగా చర్చ సాగుతోంది. ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలుగా గుర్తించి ప్రభుత్వం విలీన గ్రామాలకు ఆమోదం తెలిపింది. అయితే మునిసిపాలిటీలో విలీనం అయ్యే గ్రామాలకు ఎన్నికలు నిర్వహిస్తారా.. లేక మున్సిపల్ ఎన్నికలతో పాటే అక్కడ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై ప్రభుత్వం కూడా విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ఈ గ్రామాల్లోని ఎన్నికల నిర్వహణ ఉత్కంఠగా మారింది. మరోవైపు తమ గ్రామాలలోని ఎన్నికలపై ఆశావాహులు ఆతృతగా ఎదురు చూస్తుండగా, తాము పంచాయతీ పరిధిలో ఉంటామా.. లేక మున్సిపాలిటీ పరిధిలో ఉంటామా అనేది సందిగ్ధం నెలకొంది.
స్థానిక పోరుకు అంతా రెడీ..
ఆదుల బుదుమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు దశల్లో సర్పంచ్ వాడు స్థానాల ఎన్నికలకు ప్రభుత్వం అంత సిద్ధం చేసింది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో 473 గ్రామపంచాయతీలు, 3850 వాడు స్థానాలు, 17 జడ్పీటీసీ, ఎంపీపీలు158, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇంతకుముందు ఈ పదవుల్లో కొనసాగిన వారు పదవి విరమణ పొంది నెలలు గడుస్తున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో 318 గ్రామపంచాయతీలు, 2740 వార్డులు, 16 జెడ్పీటీసీలు, 130 ఎంపీటీసీ స్థానాలకు, అదేవిధంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 340 గ్రామపంచాయతీలు ఉండగా, 2880 వార్డు స్థానాలు,17 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలకు, నిర్మల్ జిల్లాలో 403 గ్రామపంచాయతీలు, 3343 వాడు స్థానాలు,18 జెడ్పీటీసీలు,156 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే పల్లెలో ఎన్నికల సందడి వేడెక్కనుంది. ఆశావాహులు టికెట్లు సాధించేలా ఎవరికి వారే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు, ఓటర్ జాబితా ఇప్పటికే అధికారులు సిద్ధం చేసి ఉంచారు.