నవంబర్ 16:నవంబర్ 15 శుక్రవారం నుంచి శబరిమల ఆలయం మండల- మకర విళక్కు పండుగ ప్రారంభమైంది. ఈ మండల పూజ నవంబర్ 16 నుంచి అధికారికంగా ప్రారంభమై డిసెంబర్ 26 వరకు కొనసాగుతుంది.అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు శబరిమల వచ్చి అయ్యప్పను దర్శించుకుని మాల విరమిస్తారు.
ఈ మండల సీజన్ లో దర్శన సమయాలు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటాయి. దీని తర్వాత రెండో దశ మకరవిళక్కు పండుగ డిసెంబర్ 30న ప్రారంభమై జనవరి 20, 2025తో ముగుస్తుంది. జనవరి 15న మకర జ్యోతి దర్శనం నిర్వహిస్తారు. ఈ వేడుకను తిలకించేందుకు యాత్రికులు తరలివస్తారు.
శబరిమల యాత్ర చాలా కష్టతరమైనది. ఎరుమేలి నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యలో కొండలు దాటి శబరిమల చేరుకుంటారు. శబరిమల చేరుకునేందుకు పెద్ద పాదం, చిన్న పాదం అని రెండు మార్గాలు ఉంటాయి. చిన్న పాదం గుండా శబరిమల చేరుకునేందుకు బస్సులు ఉంటాయి.
పెద్ద పాదం అంటే ఏంటి?
పెద్ద పాదం అంటే వనయాత్ర. సుమారు 48 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్ళి భక్తులు సన్నిధానం చేరుకుంటారు. అడవుల గుండా యాత్రికులు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళతారు. ఎరుమేలి దగ్గర యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ ఉన్న వావరు స్వామిని ముందుగా భక్తులు దర్శించుకుంటారు. అక్కడ పేటై తులైల అనే నృత్యం ఆడతారు. అనంతరం ధర్మశాస్త్ర ఆలయంలో ధనుర్భాణధారియై అయ్యప్ప స్వామి కొలువై ఉంటాడు. ఇక్కడే వినాయకుడు కూడా ఉంటాడు. ఈయన్ని కన్నె మూల గణపతి అంటారు. ఇక్కడ నుంచి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది.
శబరిమల చేరుకునేందుకు ఈ వనయాత్రలో భాగంగా కొండలు ఎక్కుతారు. ఎరుమేలి, పెరూర్ తోడు, కాలైకట్టి, ఆళుదా, ఇంజ్జిపారి కోట, కరిమల, కరిలాన్ తోడు, పెరియానపట్టమ్, చెరియానపట్టమ్, పంబా నది, నీలిమల, అప్పాచి మేడు, శబరిబీడం, శరంగుత్తి, సన్నిధానం, శబరిమల చేరుకుంటారు. ఇలా ఉన్న కొండలన్నీ చేరుకుని స్వామి వారిని దర్శించుకునే మార్గాలని పెద్ద పాదం, చిన్న పాదం అంటారు. ఈ ప్రాంతం మొత్తం కొన్ని కోట్ల వన మూలికలు ఉంటాయి. వాటి నుంచి వచ్చే గాలి శరీరానికి తగలడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అందుకే తప్పనిసరిగా ఒక్కసారి అయినా వన యాత్ర చేపట్టాలని చెప్తారు.
భక్తులు ఈ మార్గంలో వచ్చే అళదా నదిలో రెండు రాళ్ళు తీసుకుంటారు. ఆ రాళ్ళను కళిద ముకుండ అనే ప్రదేశంలో పడేస్తారు. వీటిలో అన్నింటి కంటే కష్టమైనది కరిమల శిఖరం. ఇది ఎక్కడం చాలా కష్టంగా ఉంటుందట. స్వామివారు భక్తులకు స్వయంగా సహాయం చేస్తారని నమ్ముతారు.
చిన్న పాదం అంటే ఏంటి?
నడక మార్గం ద్వారా శబరిమల చేరుకోలేని వాళ్ళు చిన్న పాదం మార్గం గుండా వెళతారు. ఎరుమేలి నుంచి బస్సు మార్గం ద్వారా పంబా నదికి చేరుకుంటారు. కానీ చివర ఉండే ఏడు కిలోమీటర్లు మాత్రం కాలినడకన వెళ్ళాల్సిందే. తొలిసారి మాలధారణ చేసిన వాళ్ళు తమ వెంట తెచ్చుకున్న బాణాన్ని శరమ్ గుత్తి దగ్గర విడిచిపెడతారు. ఇక్కడ నుంచి సన్నిదానం చేరుకోవడం సులభం. కేవలం కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. ఇరుముడి ధరించిన భక్తులు మాత్రమే ఆలయంలోని 18 మెట్లు ఎక్కి స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్వామి వారిని దర్శించుకుని పునీతలవుతారు.