నవంబర్ 26: ప్రతిపక్షాల నిరసనల హోరుతో ఉభయ సభలు రేపటికి వాయిదా.వక్ఫ్ జెపిసి, సంభాల్ హింసపై స్పీకర్‌తో ప్రతిపక్ష ఎంపీిల భేటీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అదానీ ముడుపుల వ్యవహారంపై శీతాకాల సమావేశాల తొలి రోజున పార్లమెంటు అట్టుడికింది. దీనిపై సంయుక్త పార్లమెంటరీ సంఘం(జెపిసి)తో సమగ్ర విచారణ జరిపించాలని, పార్లమెంట్‌లో దీనిపై ప్రత్యేక చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. దీనికి ప్రభుత్వం ససేమిరా అనడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభా మధ్య భాగంలోకి దూసుకెళ్లి మోదానీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశాయి.. దీంతో పలు దఫాలు వాయిదా పడిన ఉభయ సభలు చివరికి బుధవారానికి వాయిదాపడ్డాయి.. రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు ఉన్నందున మంగళవారం పార్లమెంటుకు సెలవు. అదానీకి సంబంధించిన అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మాన నోటీసును లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ తిరస్కరించారు. లోక్‌సభ ఉదయం ప్రారంభమైన వెంటనే ఇటివల కాలంలో మరణించిన సభ్యులకు సంతాపం తెలియచేసింది. అనంతరం అదానీ వ్యవహారంపై సభ ప్రారంభమైన నాలుగు నిమిషాలకు ఒకసారి, మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి, వాయిదా పడింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపి కె.సి.వేణుగోపాల్ మాట్లాడుతూ అదానీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. ఒక్క మాట కూడా వినేందుకు వారు సిద్ధంగా లేరని, అందుకే ఒక సెకనులోనే సభను వాయిదా వేశారని విమర్శించారు.
రాజ్యసభలోనూ గందరగోళం
రాజ్యసభ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ముడుపుల వ్యవహారాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని లేవనెత్తేందుకు యత్నించగా చైర్మన్ ధన్‌ఖర్ అడ్డుకున్నారు. అదానీ అవినీతిపై చర్చించాల్సిందేనని ఆయన పట్టుపట్టారు. దీంతో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అదానీ అవినీతి అంశం దేశాన్ని ప్రభావితం చేస్తోందని ఖర్గే అన్నారు. అదానీకి ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుగా నిలుస్తున్నారని విమర్శించారు. షేర్ల తారుమారు, ఆర్థిక అక్రమాలు, అకౌంటింగ్ మోసాలు, బొగ్గు ధర ధరలను వాస్తవిక ధర కన్నా అనేక రెట్లు పెంచి చూపడం, వంటివాటికి తోడు లంచాల భాగోతం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున ఈ మొత్తం వ్యవహారంపై చర్చ జరగాలని సిపిఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ తన నోటీసులో డిమాండ్ చేశారు. వాయనాడ్ కొండచరియల బాధితులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరాఉ. దీంతో రాజ్యసభ సమావేశాలను చైర్మన్ ధన్‌కర్ బుధవారానికి వాయిదా వేశారు. 267వ నిబంధన కింద తనకు 13నోటీసులు అందాయని, వాటన్నింటినీ తిరస్కరించినట్లు చెప్పారు. వక్ఫ్‌్ సవరణ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరగాల్సి ఉండగా ఎంపీలు కె రాధాకృష్ణన్, ఈ టి మహ్మద్ బషీర్ బిల్లును వ్యతిరేకించారు. ప్రజలను విభజించే వ్యూహంలో భాగమే వక్ఫ్ సవరణ బిల్లు ఉద్దేశమన్నారు. వక్ఫ్ చట్ట సవరణ చాలా విస్తృతమైన పర్యవసానాలకు దారి తీస్తుందని రాధాకృష్ణన్ అన్నారు. సభ్యుల ఆందోళనలను పరిష్కరిస్తేనే బిల్లుకు మద్దతిస్తామని కాంగ్రెస్ నాయకుడు కెసి వేణుగోపాల్ అన్నారు. పదే పదే సభకు అంతరాయం కలగడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ, కొత్త ఎంపిలు ఈ అంతరాయాలతో ఎక్కువగా ప్రభావితమవుతారని అన్నారు.. రాజ్యాంగం ఏర్పడి మంగళవారానికి 75 ఏళ్లు పూర్తి అవుతాయని అన్నారు. తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు మరింత బలం చేకూర్చాయని అన్నారు.
సంభాల్ హింసపై స్పీకర్‌తో ప్రతిపక్ష ఎంపిలు భేటీ
వక్ఫ్ (సవరణ) బిల్లు-2024పై పార్లమెంటు జాయింట్ కమిటీ (జెపిసి) సభ్యులుగా ఉన్న ప్రతిపక్ష ఎంపిలు సోమవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. తమ అభిప్రాయాలు విన్న తరువాత జెపిసి రిపోర్టు ప్రవేశపెట్టేందుకు, అందుకోసం జెపిసి కమిటీ పొడిగింపునకు స్పీకర్ హామీ ఇచ్చారని ఆప్ ఎంపి సంజరు సింగ్ తెలిపారు. ”అన్ని పక్షాల వాదనలు విన్న తరువాత మాత్రమే జెపిసి నివేదికను తయారు చేయవచ్చు” అని అన్నారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిన హింసాకాండపై చర్చించాలని కోరుతూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపిలందరూ సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ప్రతినిధి బృందానికి ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నాయకత్వం వహించారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.