అక్టోబర్ 17: మా ఇంట్లో అయితే చారు లేకుండా చెయ్యి కడగము..! అని అంటుంటారు సాధారణంగా చాలా ఇండ్లలో.
సాధారణంగా ముద్దపప్పూ చారు మంచి కాంబినేషన్..!
శాకాహారులయితే వేయించిన బంగాళాదుంప ముక్కల మీద కొద్దిగా ఉప్పు కారం చల్లి చారు అన్నంలో నంజుకుంటారు.
ఆ రుచికి వాళ్ళ కళ్ళు అరమోడ్పులవుతాయి.
మాంసాహార ప్రియులు మాత్రం మంచి నాటుకోడి వేపుడు తో పాటు చింతపండు చారుతో గుప్పెడన్నం తింటే స్వర్గం పక్కనే ఉన్నట్టుంటుంది.
పసి బిడ్డలు మొదలుకుని పండు ముసలి వరకు చారు చాలా ఆరోగ్యవంతమైనది.
అన్నప్రాసన అయిన వెంటనే పసిబిడ్డలకు అన్నం పెట్టడం మొదలుపెడతారు.
బాగా ఉడికిన అన్నం మెత్తగా పిసికి కొద్దిగా చింతపండు చారు కలిపి పిల్లలకి తినిపిస్తారు.
పసివాళ్ళు కూడా పెదాలు నాక్కుంటూ చప్పరించేస్తారు.
ఇక వృద్దులయితే జీర్ణసమస్యలు తొలగుతాయి.
చింతపండు చారు సరిగ్గా చేస్తే..!
వేరే కూర అక్కర్లేదు అసలు..!
వేడి అన్నం..కొద్దిగా ఆవకాయ లేదా పులిహోర తాలింపు పెట్టిన తొక్కుడు పచ్చడి..మరగ కాచిన నెయ్యి..!
రెండు ముద్దలు పచ్చడి తో లాగించి..ఆ పైన పళ్ళెం నిండా పొగలు కక్కుతున్న..కర్వేపాకు సహిత చారు వేసుకుని తింటే ఆరోజు జయప్రదంగా ముగిసినట్టే..!
నోటికి రుచి..ఒంటికి చలువ..!
ఆరోగ్యానికి ఆరోగ్యం..తయారు సులభం..!
ఎంత మంచి వంటకం..!
నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు..!
మా ఇంటి చుట్టుపక్కల పసిబిడ్డలందరికీ మా తల్లిగారే ఇచ్చేవారు.
ఇప్పటికీ మా ఇంట్లో తప్పని సరిగా చింతపండు చారు ఉండాల్సిందే..!
చారు నీళ్ళు అని ఈసడించేవారు కూడా పళ్ళెం కడగాల్సిన అవసరం లేకుండా శుభ్రంగా నాకేస్తారు.
అదీ చారు విశిష్టత..రుచి మహత్యం..!
ఇంతటి పోషక విలువలు..ఆరోగ్యం..రుచి కలిగిన చింతపండు చారు తయారు చెయ్యడం ఏమైనా పెద్ద కష్టతరమైన వంటకమా అంటే అసలు కానే కాదు.
మంచి పరిశుభ్రమైన నీళ్ళుతీసుకుని..చిటికెడు స్వచ్ఛమైన నాణ్యమైన పసుపు..రెండు రెబ్బలు కర్వేపాకు..వేసి మంట అదుపులో ఉంచి మరగించాలి.
అందులో పాతదైనా..కొత్తదైనా పర్వాలేదు చింతపండు గింజలు తీసి వేసుకోవాలి.
అలాగే రవ్వంత బెల్లం ముక్క పడేస్తే అదే కరుగుతూ ఉంటది.
రుచి కి సరిపడినంత ఉప్పు..కళ్ళుప్పు అంటారు అదైతే మేలు.
బాగా మరగాలి..!
తెర్లు తెర్లు గా మరగాలి..!
తర్వాత..!
తాలింపు..!
రెండు చెంచాలు నువ్వుల నూనె..!
జీలకర్ర..ఆవాలు..మెంతులు..ఎండుమిర్చి..కర్వేపాకు..!
కొద్దిగా ఉల్లిపాయ తరుగు..సన్నగా తరిగింది వేసి..పోపు మాడకుండా దింపుకుని రెండు గరిటలు ముందుగా మరిగించిన చారుని మూకుట్లో వేసుకోవాలి.
అప్పుడు వచ్చే శబ్దం..సువాసన..గొట్రు ఆకలి రెట్టింపు చేస్తుంది..ఒట్టు..!
మూకుడు తొలిచేసి అంతా ఏకం చేసేసి ఒక గిన్నెలోకి తీసుకుని చూస్తే..కర్వేపాకు వల్లనో ఏమో లేత..మరీ లేత ఆకుపచ్చ వర్ణం గా అనిపిస్తుంది.
మెంతులు ఆవాలు..జీలకర్ర జలకాలాడుతున్నట్టు..ఎండు మిర్చి..కర్వేపాకు తేలుతూ కంటికి ఇంపుగా కనిపిస్తాయి.
అప్పుడు కొత్తిమీర పైన వేసి మూత పెట్టాలి.
చింతపండు చారు..కొంచెం పులుపు రవ్వంత తీపి..ఒకరకమైన రుచి..నూనెలో వేగిన మెంతిగింజ ఉండటానికి చేదుగా ఉన్నా ఆ రుచి మాత్రం అమోఘం..!
అసలు ఇదంతా ఎందుకంటే..!
నాకు చారు లేనిదే ముద్దదిగదు..!
జ్వరం వచ్చి తగ్గింది..!
మందు బిళ్ళల ధాటికి నోరు చేదెక్కిపోయి..!
నాలిక తన సహజ గుణాన్ని కోల్పోయింది.
ఇలాంటి సమయంలో చారు ఆదుకుంటుంది.
రెండు ముద్దలు సునాయాసంగా లోపలికి వెళతాయి.
సాంబారు.రసం..!
అలాగే అనేక రకాల రసాలు రుచి చూసి ఉంటారు.
ఒక వేళ చింతపండు చారు రుచిచూడని వారు ఒకసారి చూడండి.
ముద్దపప్పు తో కూడా కలిపి చూడండి.
పప్పు ఆవకాయ లాగానే..పప్పుచారు కూడా ప్రసిద్దే..!