గరిక మహిమ

గరిక మహిమ

సెప్టెంబర్ 12:సీతాదేవి తండ్రి అయిన జనకమహారాజు వంశంలో ఉన్నవాళ్ళందరిని జనకుడు అనే పిలుస్తారు.ఒకప్పుడు జనకమహారాజు చక్కగా రాజ్య పరిపాలన చేసేవాడు. అడిగిన వారికి లేదనకుండా దానధర్మాలు చేసేవాడు. ఇలా ఉండగా…
గొప్పగా దానాలు చేస్తున్నాను. నా అంత గొప్పవాడు లేడు అనే భావన పెరిగిపోయింది ఆయనలో.ఇంత గొప్ప దానాలు చేస్తున్నాను కనుక భగవంతుడు నన్ను ఎలాగైనా అనుగ్రహిస్తాడు అని తలచాడు.ఈ విషయం విన్న నారద మహర్షి ఆయనకు కనువిప్పు కలిగించాలని భావించి, గణపతికి చెబుతాడు.నేను చూస్తానని చెప్పి గణపతి ఒక బ్రాహ్మణుని వేషంలో జనకుని వద్దకు వెళతాడు. అప్పుడు జనకుడు అన్నదానం చేస్తుంటాడు.గణపతితో “నేను అన్నదానం చేస్తున్నాను. మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి” అంటాడు.నాకు సరిపడినంతగా పెట్టేంత భోజనం ఉందా నీ వద్ద” అన్న గణపతితో”ఎందరికో పెడుతున్నాను. మీకూ అలాగే పెడతాను. తినండి” అంటాడు జనకుడుసరేనని గణపతి భోజనానికి కూర్చుంటాడు. కొద్దిసేపటిలోనే వండిన పదార్ధాలు అన్నీ తినేసి, ఇంకా నాకు కడుపు నిండలేదు. అర్ధాకలితో వున్నాను. అతిథి అర్ధాకలితో వెళితే, నీకే పాపం” అంటాడు గణపతి.ఇంకా ఉన్నవన్నీ వండించి పెట్టినా కడుపు నిండలేదు అనే చెబుతాడు.
“ఇంకా నా వద్ద ఉన్న నిల్వలన్నీ అయి పోయాయి. ఎలా పెట్టను” అంటాడు జనకుడు. కానీ వచ్చినవారు ఎవరు అని ఆలోచించడు.

“మీ రాజ్యంలో ఉన్న వాళ్ళ దగ్గర్నుంచి తెప్పించి పెట్టు. అలాగైనా నా కడుపు నిండుతుందేమో చూస్తాను” అంటాడు గణపతి.

రాజ్యంలోని అందరూ పంపుతారు. అయినా కడుపు నిండదు.”ఏం చేయను” అన్న రాజుతో
“నువ్వు నాకు కడుపునిండా అన్నం పెట్టలేకపోయావు. ఇక నేను మీ రాజ్యంలో వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి అడుగుతాను. ఎవరైనా నా కడుపు నింపగలిగిన వారు వుంటారేమో చూస్తాను” అని గణపతి
రాజ్యంలో తిరిగి తిరిగి ఒక పేద దంపతుల ఇంటికి వెళ్తాడు.

విరోచనాదేవి, త్రిశిరుడు అనే దంపతులు గణపతికి భక్తులు. కానీ దారిద్ర్యంతో బాధపడుతుంటారు. అయినా ఎప్పుడూ కూడా తమ స్థితికి చింతించి, దైవనిందకు పాల్పడకుండా, దొరికిన దాంట్లో తింటూ తృప్తితో జీవనం సాగిస్తున్నారు. నిరంతరం గణేశునికి గరిక సమర్పించి, కొలుస్తూ వుంటారు.జనక మహారాజు గణపతికి కడుపు నింపలేకపోతాడు. అప్పుడు అక్కడ్నుంచి బయలుదేరిన బ్రాహ్మణ రూపధారి అయిన గణపతి..
” జనకమహారాజు నా కడుపు నింపలేక పోయాడు. మీలో ఎవరైనా కడుపునింపండి” అని అందరికి చెబుతూ చివరికి ఈ దంపతుల వద్దకు వెళతాడు.”మీ జనకమహారాజు నా కడుపు నింపలేక పోయాడు. మీరైనా నాకేదైనా పెట్టి కడుపు నింపండి” అని అడుగుతాడు.
అప్పుడు వారు..

“అయ్యా! అంతటి మహారాజే మీకు పెట్టలేకపోయాడు. రాజ్యంలోని వాళ్ళెవ్వరూ పెట్టలేక పోయారు. ఇక నిత్య దరిద్రులము మేమెలా నింపగలము. ఈ రోజు మేము కేవలం మంచినీళ్లు త్రాగి కడుపు నింపుకోవాలి. నీళ్లు మాత్రమే ఉన్నాయి. అవే గణపతికి నైవేద్యంగా సమర్పించాం. అవే మేము తీసుకోవాలి. అవే మీరు తీసుకోండి” అంటూ తెచ్చి ఇవ్వబోతారు.”అంతే ఇచ్చారా మీరు గణపతికి? ఇంకేమీ ఇవ్వలేదా? ఒకసారి సరిగ్గా చూసి, ఆలోచించి చెప్పండి” అంటాడు గణపతికాసేపు ఆలోచించి..
“ఆ! గుర్తొచ్చింది. గరిక మాత్రమే సమర్పించాం” అంటారు”అయితే ఆ గరికనే ఇవ్వండి. ఆ గరిక నా కడుపు నింపుతుందేమో చూద్దాం” అన్న గణపతికి
ఆ గరిక తెచ్చి ఇస్తారు.

ఆ దుర్వారం (గరిక) తీసుకుని నోట్లో వేసుకుని, ‘తృప్తోస్మి’ అని వాళ్ళతో..

నా కడుపు నిండిపోయింది. అంటాడు చిన్నపిల్లవాడు సంతోషించినట్లుగా

ఆ మాట వినగానే ఆ దంపతులు…

“స్వామీ! నువ్వెవరో మహానుభావుడివి…
ఆ! అర్ధం అయ్యింది. నువ్వు మేము నిత్యం ఆరాధించే గణపతివి. మమ్మల్ని అనుగ్రహించడానికి ఇలా వచ్చావా! తండ్రీ! నీ అనుగ్రహానికి నోచుకున్న మేమెంత ధన్యులము” అంటూ కన్నులనుండి ఆనందభాష్పధారలు స్రవిస్తుండగా గణపతికి ప్రణమిల్లుతారు.

తన అసలు రూపంతో కనిపించిన గణపతి వారిని తనలో ఐక్యం చేసుకుంటాడు.

ఆ విషయం విన్న జనకమహారాజు ఇన్ని దానధర్మాలు చేసానే నేను. నన్ను అనుగ్రహించలేదు గణపతి అని చింతిస్తుంటే ఆయన వద్దకు వచ్చిన నారద మహర్షి..

“రాజా! నువ్వు దానధర్మాలు గొప్పకోసం చేశావు. అది నీ అహంకారానికి దారి తీసింది. అహంకారంతో చేసే పనులను భగవంతుడు హర్షించడు. ఆ దంపతులు తమకున్న దాంట్లో తృప్తి పడి, నిరంతరం గణపతిని దుర్వారాలతో పూజించి, ఆయనలో ఐక్యం పొందారు. మనం చేసే పని భగవదర్పితంగా చేస్తే అది సత్ఫలితాలను ఇస్తుంది” అని బోధిస్తాడు.

అది విని జనకుడు నిజం తెలుసుకున్నవాడై ఆ దంపతుల వలెనే దర్పం లేకుండా, నిరంతరం దుర్వారంతో గణపతిని అర్చించి, తరిస్తాడు.

అలా ఒక్క దుర్వారం (రెండు గరికలు) గణపతికి భక్తిగా సమర్పించి, నమస్కరిస్తే తన అపార కరుణను వర్షించి, వారిని తనలోనే ఐక్యం చేసుకుంటాడు.
శ్రీ గణేశ శరణం మమ🙏

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *