సెప్టెంబర్ 1:తెలుగు రాష్ట్రాల్లో వర్షం నిరంతరాయంగా కురుస్తోంది. ఆ ప్రాంతం ఆప్రాంతం అని లేకుండా.. అన్ని చోట్ల వర్షం కమ్మేసింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడటంతో జనజీవనం స్తంభించి పోయింది.
ఇప్పటికే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల్లో వరద ప్రవాహ ఉధృతి పెరిగిపోయింది. దాంతో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ అధికారులకు సూచనలు చేశాయి. మరోవైపు ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా వైపుగా కదులుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. విశాఖకు ఈశాన్యంగా 90 కి.మీ దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతోనే రెండు రాష్ట్రాల్లో భారీ వానలు పడుతున్నాయి. అయితే.. ఇవాళ, రేపు భారీ నుంచి అతభారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 3 వరకు వర్షం హెచ్చరికలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారులను ఆదేశించింది. భారీ వర్షాలపై ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ కూడా ఆరా తీశారు.మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖలు మరింత చురుకుగా వ్యవహరించాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలన్నారు.
హైదరాబాద్ వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇక విజయవాడలో గతంలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదు అయ్యింది. 20 ఏళ్ల తర్వాత తొలిసారి భారీ వర్షపాతం నమోదైంది. విజయవాడలో కొండరియలు విరిగి ఇళ్లపై పడటం వల్ల నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. చాలా చోట్ల వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించి పోయింది. రహదారులపై భారీగా వరద నీరు చేరటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. సిబ్బందికి సెలవులు ఇవ్వొద్దని మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.