సెప్టెంబర్ 17;
నరేంద్ర మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ఆయన 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో దామోదర్ దాస్ మోడీ, హీరా బెన్ దంపతులకు జన్మించారు. వారికి మోడీ మూడో సంతానం. నరేంద్ర మోడీ వార్డ్ నగర్‌లోని పాఠశాల విద్యను, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిస్టెస్స్ ఎడ్యూకేషన్ ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, గుజరాత్ యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
రాజకీయ జీవితం :
మోదీ ఆర్.ఎస్.ఎస్ లో పనిచేస్తున్న సమయంలో నే ఆనాటి గుజరాత్ రాష్ట్ర జనసంఘ్ పార్టీ ముఖ్య నాయకులు నాథులాల్ ఝాగ్దా, వసంత్ భాయ్ గజేంద్రద్కర్ లతో ఏర్పడ్డ సన్నిహిత సంబంధాలు మోదీని రాజకీయాల పట్ల ఆకర్షితుడిని చేశాయి. 1986లో ఆర్.ఎస్.ఎస్ నుంచి భాజపా లోకి ప్రవేశించిన మొదటి తరం నాయకుల్లో వీరు ఒకరు. భాజపాలో చేరిన తర్వాత అహ్మదాబాద్ పురపాలక సంఘ ఎన్నికల బాధ్యతలు తీసుకొని పురపాలక ఎన్నికల్లో భాజపాని గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించి భాజపా అగ్రనాయకత్వం దృష్టిలో పడ్డాడు. అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎల్.కె.అద్వానీ ప్రోత్సాహం కూడా తోడై కొద్దికాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్ బాధ్యుడిగా, 1992లో మరళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి–కాశ్మీర్ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్‌చార్జీగా పనిచేశారు.[6]
1993లో బీజేపీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు యాత్రలు చేపట్టారు. 1995 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కీలకమైన పాత్ర పోషించారు. ఈ విజయం తరువాత ఆయన సేవలను జాతీయ స్థాయిలో వాడుకునేందుకు అద్వానీ తదితరులు ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఇంఛార్జిగా నియమించడం జరిగింది. ఆయా రాష్ట్రాల ఇంఛార్జిగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. మోదీ సాధించిన విజయాలను గమనించిన ఆర్.ఎస్.ఎస్, బీజేపీ నాయకత్వం బీజేపీ జాతీయ కార్యదర్శి పదవిని కట్టబెట్టింది. 1997లో అద్వానీ చేపట్టిన స్వర్ణజయన్త రథయాత్ర నిర్వహణ బాధ్యతను తీసుకొని విజయవంతంగా నిర్వహించి రథయాత్ర విజయానికి కీలకమైన పాత్ర పోషించాడు. 1998లో బీజేపీ పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన కుష్బూ థాక్రే ప్రోద్బలంతో మోదీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన 1998, 1999లలో లోక్ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే 1998లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తన వ్యూహాలతో పార్టీని విజయతీరాలకు చేర్చడంతో పార్టీలో సీనియర్ నాయకుడైన కేశూభాయి పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. 2000వ సమయంలో గుజరాత్‌లోని కుచ్ ప్రాంతంలో సంభవించిన పెను భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం 2001 అక్టోబరులో నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించింది. అప్పటి నుంచి 2014 మే 21 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగారు.