సెప్టెంబర్ 13: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకే కాదు.. దేశ రాజకీయాలకూ తీరని లోటు అని చెప్పవచ్చు. విద్యార్థి దశనుంచే వామపక్ష భావాలను అలవరచుకున్న ఆయన.. తుదిశ్వాస విడిచే వరకు ప్రజా పోరాటాల్లో బతికారు. తన జీవితాన్నే కాదు.. చివరకు తన దేహాన్ని సైతం ప్రజాసేవకే అంకితమిచ్చారు. మరణించిన తర్వాత కూడా ఆయన పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం దానం చేస్తున్నట్లు ఏచూరి కుటుంబీకులు ప్రకటించారు. కమ్యూనిస్టు నేతలు తమ పార్థివదేహాలను పరిశోధనల కోసం ఇచ్చే సంప్రదాయం గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది.
పార్థివ దేహాలను పరిశోధనల కోసం దానం చేసే పద్ధతిని కమ్యూనిస్టులు కొనసాగిస్తున్నారు. ఆగస్టు 2024లో మరణించిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) భౌతికకాయాన్ని కూడా వైద్య పరిశోధనల కోసం దానం చేశారు. కోల్‌కతాలోని నీల్ రతన్ సిర్కార్ (NRS) ఆసుపత్రిలోని అనాటమీ విభాగానికి పార్థివ దేహాన్ని అప్పగించారు. ఇందుకు సంబంధించి మార్చి 2006లోనే బుద్ధదేవ్ (Buddhadeb Bhattacharjee) ఓ స్వచ్ఛంద సంస్థకు హామీ ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్‌కు సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కమ్యూనిస్టు దిగ్గజ నేత జ్యోతిబసు కూడా మరణాంతరం శరీరాన్ని వైద్య సేవలకే అప్పగించారు. 2010లో జ్యోతిబసు మరణించగా.. ఆయన పార్థివ దేహాన్ని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి దానం చేశారు.
సుదీర్ఘ కాలంపాటు వామపక్ష పార్టీలో కొనసాగిన లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ కూడా శరీర దానం చేస్తానని 2000లో ప్రతిజ్ఞ చేశారు. 2018లో ఆయన మరణించగా.. ఆయన కుటుంబీకులు శరీరాన్ని దానం చేశారు. సీపీఎం కార్యదర్శి అనిల్ బిశ్వాస్‌తోపాటు పార్టీ సీనియర్ నేత బెనోయ్ చౌధురీల భౌతికకాయాలూ ఆస్పత్రులకు అప్పగించారు.
సెప్టెంబర్ 14న పార్టీ కార్యాలయానికి ఏచూరి భౌతికకాయం
సీతారాం ఏచూరి గురువారం మధ్యాహ్నం 3.03 గంటలకు కన్నుమూసినట్లు సీపీఎం ప్రకటించింది. ఆయన పార్థివ దేహాన్ని సెప్టెంబర్ 14న తమ పార్టీ కేంద్ర కార్యాలయం ఏకే గోపాలన్ భవన్‌కు తరలించనున్నట్లు తెలిపింది. అక్కడ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు పేర్కొంది. ఏచూరి కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని పరిశోధనల కోసం దిల్లీ ఎయిమ్స్‌కు అప్పగిస్తామని తెలిపింది.