హైదరాబాద్ ఆగస్టు 28: హైడ్రా కూల్చివేతలు కొంత మంది బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ప్రభుత్వంలో ఏ స్థాయిలోనూ హైడ్రా కూల్చివేతలను ఆపే పరిస్థితి లేకపోవడంతో గత్యంతరం లేక హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారు. హైడ్రాను తమవైపు రాకుండా అడ్డుకోవాలంటూ ఇప్పటి వరకు 200లకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. మొట్టమొదట కేటీఆర్ ఉంటున్న జన్వాడ ఫామ్ హౌజ్ కు సంబంధించిన ఫిటిషన్ హైకోర్టులో పడింది.
ఆ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి తన నీలిమ విద్యా సంస్థల నిర్మాణాలపైకి హైడ్రా రాకుండా స్టే ఇవ్వాలంటూ కోర్టుకు వెళ్లారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తరఫున కూడా కూల్చివేతలు ఆపాలంటూ పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తున్నది. చట్ట ప్రకారం హైడ్రా తనపని తాను చేసుకోవచ్చని ఇప్పటికే రెండు పిటిషన్ల విషయంలో హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు కూల్చివేతల విషయంలో హైడ్రా కూడా పకడ్బందీగా ముందుకు వెళ్తాంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్న క్రమంలో హీరో నాగార్జున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు.
కానీ స్టే ఆర్డర్ వచ్చేలోపు ఎఫ్ఎఎల్, బఫర్ జోన్లో ని నిర్మాణాన్ని హైడ్రా నేలమట్టం చేసింది. ఎవరు కోర్టు మెట్లు ఎక్కుతున్నారో వారికి సంబంధించి అక్రమ నిర్మాణాలు ఏ చెరువులో ఎంత ఉన్నాయో స్పష్టమైన ఆధారాలతో నివేదించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.
ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి లేదు
రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇవ్వడంతో దాని ని ఆపడం కోర్టు వల్ల తప్ప ఎవరి వల్లా సాధ్యం కాదని బడాబాబులు భావిస్తున్నారు. హైడ్రా ఏర్పాటై నెలన్నర దాటింది. కేవలం ఈ 10 రోజుల వ్యవధిలోనే కూల్చివేతలు పెరిగాయి. హైడ్రా కూల్చివేతల్లో భాగంగా తొలుత కోర్టుకు వెళ్లింది జన్వాడలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌజ్ పైనే కావడం గమనార్హం. ఆ ఫామ్ హౌస్ కూల్చవద్దని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి పిటిషన్ వేశారు.
ఈ సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిమితుల గురించి చెప్పాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ కు
హైకోర్టు సూచించింది. ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా హైడ్రా తనకున్న పరిధిలో చట్ట
ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతే తప్ప కూల్చివేతలు ఆపాలని చెప్పలేదు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ
పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.
దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా హైకోర్టు గడప తొక్కారు.వీరితోపాటు మల్లారెడ్డి, చెరువులు, కుంటలు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన ఇతర మాజీ మంత్రులు, ప్రముఖులు కూడా సైలెంట్ గా కోర్టుల్లో పిటిషన్లు వేసినట్లు తెలుస్తున్నది.
కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సపోర్ట్
అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరిని వదిలేది లేదని.. కురుక్షేత్ర యుద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్లే హైడ్రా దూకుడు కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు చెందిన సీనియర్ లీడర్, మాజీ కేంద్రమంత్రి అక్రమ కట్టడాన్ని సైతం హైడ్రా నేలకూల్చింది. దీంతో హైడ్రా కూల్చివేతలు ఆపడం ఎవరి తరం కాదనే మెస్సేజ్ ను ప్రభుత్వం అక్రమార్కులకు బలంగా పంపింది.
నిజానికి హైడ్రా కూల్చివేతలు మొదలుకాగానే కొందరు నేతలు, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఢిల్లీ స్థాయిలో హైకమాండు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. కానీ పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడాలి తప్ప ప్రజలకు మేలు చేసే ఇలాంటి కార్యక్రమాలు ఆపాలని చెప్పవద్దంటూ మందలించడంతో అందరూ సైలెంట్అయిపోయినట్లు అధికార పార్టీలోనూ చర్చ జరుగుతోంది.