భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 29న కొన్ని మీడియా వేదికల్లో తాను చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలు.. కోర్టులను ప్రశ్నిస్తున్నాననే అర్థంలో ధ్వనించాయని చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తల పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టుకు సారీ చెప్పారు. తన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపాదించారని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టు చేశారు.తెలంగాణ సీఎం క్షమాపణలకు కారణం గురువారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమే. ఓటుకు నోటు కేసును తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న BRS నేత జగదీష్‌రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా.. కవిత్ బెయిల్‌పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం స్పందించింది. ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిందితులకు మేము బెయిల్ ఇస్తామా అంటూ.. రేవంత్ రెడ్డి తరపు లాయర్లను జస్టిస్ గవాయి తిసభ్య ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి.. సుప్రీం కోర్టు పట్ల గౌరవంగా మెలగాలని, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంత మాత్రమూ సరికాదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దీంతో సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం, అపారమైన గౌరవం ఉందన్నారు. తన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపాదించారని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ ప్రక్రియపై తనకు విశ్వాసం ఉందన్నారు. న్యాయవ్యవస్థపైనా, ఆ వ్యవస్థ స్వతంత్రతపైనా తనకు అత్యంత నమ్మకం ఉందని సీఎం రేవంత్ ఈ ట్వీట్‌లో తెలిపారు. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే తాను.. ఎన్నటికీ న్యాయ వ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటానని పేర్కొన్నారు.