ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అధికార పక్షంపై విమర్శల వర్షం గుప్పించారు. అయోధ్య రాములవారి ఆలయం నుంచి విపక్షాలపై దర్యాప్తు సంస్థల దాడుల వరకు ఆయన స్పందించారు.రాహుల్ ప్రసంగిస్తుంటే విపక్షాలను చప్పట్లతో మారుమోగించారు.”నీట్ కోసం విద్యార్థులు ఏళ్ల పాటు చదువుతారు. ప్రొఫెషనల్ ఎగ్జామ్ అయిన NEETను కమర్షియల్ ఎగ్జామ్‌గా మార్చారు. బీజేపీ హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి. నీట్ పేద విద్యార్థుల కోసం కాదు ఉన్నత వర్గాల కోసం అనే విధంగా మార్చారు. నీట్ పరీక్ష విధానంలో అనేక లోపాలు ఉన్నాయి’ అని ధ్వజమెత్తారు. ‘నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశ ప్రజలకు కలిగిన లాభం ఏంటి? జీఎస్టీ వల్ల ప్రజలు, వ్యాపారులు ఎన్నో బాధలు పడ్డారు. నోట్ల రద్దుతో యువత ఉపాధి కోల్పోయారు. దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని స్వయంగా మోదీ చెప్పారు. నోట్ల రద్దు చేయాలని కూడా దేవుడే చెప్పాడా? అదానీ లాంటి పెద్దల కోసమే మోదీ నిర్ణయాలు తీసుకుంటారు’ అని మండిపడ్డారు.అయోధ్య ప్రారంభానికి కార్పొరేట్ పెద్దలకు మాత్రమే ఆహ్వానం అందిందని, ‘అయోధ్యలో చిరు వ్యాపారుల దుకాణాలు, భవనాలు తొలగించి వారిని రోడ్డుపైకి నెట్టారు. భూములు లాక్కుని విమానాశ్రయం నిర్మించారు. మందిరం ప్రారంభ సమయంలో బాధితులు దు:ఖంలో ఉన్నారు. వారిని కనీసం ఆలయ పరిసరాల్లోకి కూడా రానివ్వలేదు’ అని తీవ్ర విమర్శలు చేశారు.అధికార బీజేపీ ప్రతిపాదించిన అంశాలను వ్యతిరేకిస్తున్న లక్షలాది మందిపై దాడి జరుగుతోందని , తనపైనా వ్యక్తిగతంగా దాడి జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు. కొందరు నేతలు ఇప్పటికీ జైలులో ఉన్నారని , ప్రధాని మోదీ ఆదేశాల మేరకు, తనపై 20 కేసులు నమోదయ్యాయని, తనకు ఇచ్చిన ఇంటిని కూడా లాగేసుకున్నారని ఆరోపించారు. ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) 55 గంటలకుపైగా ప్రశ్నించిందని వివరించారు. అన్ని మతాలు ధైర్యంగా ఉండమనే ప్రబోధిస్తున్నాయని రాహుల్ వివరించారు. అయితే హిందువులుగా చెప్పుకుంటున్న వారు 24 గంటలూ కేవలం అహింస, ద్వేషం, అసత్యమే మాట్లాడుతున్నారని, మీరు అసలు హిందువులేనాఅని రాహుల్ ప్రశ్నించారు.రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని మోడీ తీవ్రంగా తప్పుబట్టారు. మొత్తం హిందువులను అందరినీ హింసాపరులుగా సంబోధించడం తీవ్రమైన అంశమని ప్రధాని అభ్యంతరం తెలిపారు. వెంటనే రాహుల్ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. ‘కాదు కాదు, మోడీ మొత్తం హిందూ సమాజం కాదు. బీజేపీ మొత్తం హిందూ సమాజం కాదు. ఆర్ఎస్ఎస్ మొత్తం హిందూ సమాజం కాదు.’ అని రాహుల్ పేర్కొన్నారు.
Posted inNATIONAL