హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి ముంగిపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడకలకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అయితే సోనియా తెలంగాణ పర్యటన రద్దయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అనారోగ్య కారణాలతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆమె హాజరకావడం లేదన్న ప్రచారం జరుగుతోంది.
అనారోగ్య సమస్యలతో దూరం..!
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆమె సతమతం అవుతున్నారు. ఈ కారణంతోనే లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రచారానికి దూరంగా సోనియాగాంధీ ఉన్నారు. అయితే ఆమె తెలంగాణ పర్యటనపై ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఆహ్వానించిన విషయం తెలిసిందే. రేపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీ వస్తారని రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నేతలు చెప్పారు. వేడుకల్లో ఆమె ప్రసంగించడానికి సంబంధించిన స్పీచ్ ను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సోనియా రాకపోవచ్చనే సమాచారం తెలుస్తోంది. ఎండ, వేడి గాలుల నేపథ్యంలో వైద్యులు విశాంత్రి తీసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకనే ఈ మేరకు సోనియా గాంధీ తెలంగాణ పర్యటనను రద్దు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీని తీసుకొచ్చేలా…
ఒక వేళ ఆమె రాకపోతే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని అయినా ఈ వేడుకలకు తీసుకురావాలని అగ్రనేతలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆమె తెలంగాణ పర్యటన గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ సోనియా రాలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ నిర్ణయం కోసం ఆలోచిస్తున్నారు. తెలంగాణను తానే తీసుకొచ్చానని మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. ఈ విషయం ప్రచారంలో కూడా ఉంది. తెలంగాణ బిల్లుకు సంబంధించి సోనియా గాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని.. ఎలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ ఆమె వేడుకల్లో పాల్గొనకపోతే రాష్ట్ర ఆవిర్భావం గురించి ఓ వీడియో సందేశం ఏర్పాటు చేసేలా కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. సాయంత్రం వరకు రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలు ఓ అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.