…
రైతులకు పంట పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వెంటనే పీఎం కిసాన్ డబ్బులు పడతాయని చెప్పారు.ఈ మేరకు పీఎం కిసాన్ 17వ విడుత డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో పడతాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 18వ తేదీన రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు వెల్లడించారు.కాగా.. ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 18న పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా ఈ డబ్బులను మోదీ విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాలను వెల్లడించారు.రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్రం పీఎం కిసాన్ పథకం తీసుకొచ్చిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. పదేళ్లలో వ్యవసాయ రంగం బలోపేతానికి మోదీ అనేక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఇక ఇప్పుడు కూడా ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సంతకం పీఎం కిసాన్ నిధులపైనే పెట్టడం ఇందుకు నిదర్శనం అని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కాగా.. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.3.04 లక్షల కోట్లును అర్హులైన వారికి అందించామని ఆయన వెల్లడించారు.ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ పథకాన్ని 2018 నుంచి ఈ పథకం అమలుచేస్తున్నారు. దీనికింద అర్హులైన రైతులకు మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున ఏటా రూ.6 వేలు పెట్టుబడి సాయంగా ఇస్తున్నారు. ఈ పథకంతో 9.3 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.